శ్రీకృష్ణుడు ఉదవుడి సంభాషణ 1

 


ఒకరోజు సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు. అలా వచ్చిశ్రీకృష్ణుడిని దర్శించుకుని పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో స్తుతించారు.సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి స్వామి అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి, వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి యిదే వస్తాను. మీరు వెళ్ళండి” అని చెప్పి వాళ్ళందరికి వీడ్కొలు ఇచ్చాడు. ఆ బ్రహ్మాదేవుడు మున్నగు దేవతలు తమతమ స్థానాలకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు యాదవును ఇలా హెచ్చరించాడు. “ఓ యాదవులార! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గుఱ్ఱపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు గోరువంకలు రాత్రిపూట వికృతస్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది, పౌరుల నివాసగృహాలలో మిణుగుఱులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక, మీరంతా ఇక్కడ ఉండద్దు. శీఘ్రమే ప్రభాసతీర్థానికి వెళ్ళండి.” అని కృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుని మాటలు వినిన యాదవులు అందరూ మిక్కిలి సంతోషంతో భార్యా బిడ్డలతో, మిత్రులతో కలసి ఏనుగులు గుఱ్ఱాలు సైన్యాలు తీసుకుని వెంటనే బయలుదేరి ప్రభాసతీర్థానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఒకసారి తాను అవతారం చలించే ముందు ఉదవుడికి ధర్మాబోధ చేస్తాను అని మాట ఇచ్చారు. అందుకని శ్రీకృష్ణుడు ఉదవుడిని తీసుకొని ద్వారకా దగ్గరలోనికి వెళతారు. ఉద్దవుడు ఈ విషయాన్ని గ్రహించి స్వామి తమని వదిలి వెళతారు అని తెలుసుకొని ఏడుస్తు శ్రీకృష్ణుడిని ఈ విధంగా స్తుతించి “ఓ దేవా! నీవు యాదవజాతిని నాశనంచేసి వెళ్ళిపోతే, మేము ఎలా మా జీవితాలు నిర్వహించగలము. నీకు సహచరులమై నీతో కలసి చేసిన స్నాన పాన భోజన శయన ఆసనాదులను ఎలా మరచిపోగలము.” అని ఉద్ధవుడు అన్నాడు. దానికి వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “బ్రహ్మదేవుడు మొదలగు దేవతల ప్రార్థన ప్రకారం భూభారాన్ని తొలగించాను. ఇక ఈనాటి నుండి ఏడవ దినమున ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం ప్రవేశిస్తుంది.
అప్పుడు మానవులు ధర్మం ఆచారం లేనివారు అవుతారు. అంతేకాక మానవులు అన్యాయపరులు, అతిరోష స్వభావులు, బహురోగ పీడితులు, సంకల్పాలు ఫలించని వారు, నాస్తికులు అయి ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోకుండ ఉంటారు. కనుక, నీవు స్నేహితులు చుట్టాలు వంటి అనుబంధాలను వర్జించు. ఇంద్రియ సౌఖ్యాలలో మునిగిపోకు. భూతలం మీద పుణ్యతీర్ధాలలో స్నానాలు చెయ్యి. పంచేంద్రియాలచే గ్రహింపదగు వస్తువులు సర్వం నశించేవిగా తెలుసుకో.
పురుషుడు అనేకామైన సంపదలను సంపాదించి కామాలకు అవకాశమిచ్చి తన గుణదోషాలకు మోహితుడు అయి ఉంటాడు. కాబట్టి, మావటివాడు మదగజాన్ని కట్టివేసిన విధంగా, ఇంద్రియాలను మనోవికారాలను నిగ్రహించి భార్యాపుత్రులపైన ధనముపైన ఆసక్తి వదలుము. సుఖమునందు కష్టమునందు సమంగా వర్తించు. ఈ విశ్వం సమస్తం పరమాత్మచే అధిష్టించబడినదిగా గ్రహించు. మాయ ఆత్మకు వశమైనదిగా గుర్తించు. జ్ఞాన విజ్ఞానములు కలవాడవు అయి, అత్మానుభవంతో సంతుష్టిపొంది విశ్వాన్ని నన్నుగా భావించి ప్రవర్తించు.” అని వాసుదేవుడు అనతిచ్చాడు.
ఉద్ధవుడు భయ భక్తి వినయాలతో చేతులు జోడించి ఇలా అన్నాడు. “మహానుభావ! సన్యాస జీవితం చాల కష్టమైంది. పామరులు ఆచరించ లేరు. నీ మాయ వలన భ్రాంతులు అయినవారు ఈ సంసార సముద్రాన్ని ఎలా తరించగలరు. ఎలా మోక్షాన్ని పొందగలరు. నేను మీ సేవకుడను కదా. నాకు దయచేసి సెలవియ్యండి. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు సహితం బాహ్య వస్తువులందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు. నీ భక్తులైన పరమ భాగవతులు మాత్రమే ఆ మాయను తప్పించుకో గలరు. ఇల్లాండ్రకైనా, గృహస్థులకైనా, యతులకైనా ఎప్పుడూ నీ నామస్మరణమే మోక్షసామ్రాజ్యాన్ని అందిస్తుంది. కాబట్టి, పరమేశ్వరా! నీ పాదాలను శరణు వేడుతున్నాను. నా మీద నీ దయారసాన్ని ప్రసరించు.” అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు అర్థించాడు. అప్పుడు అతనితో కృష్ణుడు ఇలా అన్నాడు.
మానవుని ఆత్మకు ఆత్మే గురువు అని తెలుసుకో. చెడుమార్గాలలో వెళ్లకుండా సన్మార్గంలో మెలగుతూ పరమమైన నా నివాసానికి చేరుకో. సమస్తానికి మూలమైన నన్ను సాంఖ్య యోగులు ఎప్పుడు పరమపురుష భావంతో భావిస్తూ ఉంటారు. అదీకాక ఒకటి రెండు మూడు నాలుగు అనేక కాళ్ళు కలవి; అసలు కాళ్ళులేనివి అయిన జీవజాలంలో రెండు కాళ్ళు కల మనుష్యులు ఉత్తములు; వాళ్ళలో నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగీశ్వరులు ఉత్తములు; కాని వాళ్ళలో సంశయగ్రస్తులు నన్ను గ్రహించలేరు; నేను సత్త్వగుణగ్రాహ్యుడను. ఈ విషయం గ్రహించి తమ మనసులలో జీవాత్మ పరమాత్మలను ఒకటి చేసి. శంఖం చక్రం గద ఖడ్గం శార్గ్ఞ్యం కౌమోదకి కౌస్తుభం మున్నగు ఆభరణాలు కల నన్ను తెలుసుకున్న వారు పరమయోగీంద్రులు, పరమజ్ఞానులు.” అని చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. “అవధూత యదుసంవాదం అనే ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉంది. చెప్తాను విను.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఇలా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద కల ప్రేమతో ఇలా చెప్పాడు. “ఒకప్పుడు యదురాజు దగ్గరకు ఎక్కడినుండో శంకరవేషాన్ని ధరించిన ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక సకల దిక్కుల తిరిగుతుంటాడు. ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. యదురాజు ఆ యోగికి మర్యాదచేసి “ఎక్కడ నుండి వచ్చారు” అని ఆసక్తితో అడిగాడు. యోగి ఇలా అన్నాడు. “నిర్మలమైన విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు ఇరవైనలుగురు నాకు గురువులు. వారివలన నేను విజ్ఞానిని అయినాను.” అని యోగి అనగా దానికి యదురాజు “శరీరధారి లోభం మోహం మొదలగు వాటిని వదలి ఏవిధంగా విష్ణువును చేరగలడు. తెలియజెప్పండి.” అంటే, అవధూత ఇలా అన్నాడు. సచ్ఛరిత్రా! విను. ఇతరులను నిందించకుండా, పరుల ధనాలను కాంతలను కోరకుండా, ఇతరుల వస్తువులు అపహరించే ఆలోచన లేకుండా జీవించాలి. ముసలితనం పైనపడి రోగాలు పుట్టక ముందే, శరీరంలో కంపం మొదలవక ముందే, బుద్ధి చంచలం కాక ముందే, గొంతులో శ్లేష్మం చేరక ముందే, శక్తియుక్తులు సన్నగిల్లక ముందే, ధృఢమైన భక్తిభావనతో దానవాంతకుని దివ్యమైన చరణపద్మాలను భజిస్తూ ఉండాలి. యుక్తాయుక్త ఙ్ఞానం కలిగి ఉండి, అవ్యయమైన ఆనందాన్ని అనుదినమూ పొందుతూ ఉండాలి. అట్టివాడు భవబంధ విముక్తుడు అవుతాడు. భార్యాబిడ్డలపై, ధనధాన్యములపై అతి మోహం పెంచుకునే మానవుడు, భయంకరమైన వియోగ దుఃఖాలలో కొట్టుమిట్టాడతాడు. ఏమి చేయాలో తెలియని స్థితికి చేరతాడు. ఆ బంధాలలో చిక్కుకుపోయి నీతి, వివేకాలు కోల్పోతాడు. ఆఖరికి కథలోని కపోతము వలె మనోవ్యథతో తప్పక నష్టపోతాడు. దీనికి ఒక ఇతిహాసము ఉంది. చెప్తా విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆ కపోత దంపతులు ఒకరి మీద ఒకరు చాలా మోహంతో ఉండేవారు. కొంతకాలానికి వాటికి సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలన్నీ అటుఇటూ తిరుగుతూ ఉంటే సంతోషంతో ఆ భోగానుభవంతో కొన్నినెలలు గడిచాయి. ఇలా ఉండగా, ఒకనాడు కాలవశాన ఒక బోయ వచ్చి వల వేశాడు. ఆ వలలో ఆడపావురము పిల్లలు చిక్కుకున్నాయి. మగపావురం ధైర్యం వదలి మోహంతో భార్యా బిడ్డలమీద స్నేహంతో తాను కూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించి పోయింది. కాబట్టి, దేని యందు మరీ తీవ్రమయిన మోహం మంచిది కాదు.
అందుకనే యోగీంద్రులు ఎప్పుడు హరిధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుమికిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ (ఇరవై నాలుగు) మొదలగు వాటి గుణగణాలు తెలుసుకుని మెలగుతూ ఉంటారు.” ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా, “ఇవి ఏమిటో తెలుసుకోవాలని ఉంది, నిర్మలమతితో వీటి గురించి తెలియచెప్పండి.” అని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. ఈ విధంగా, 1. భూమివలన సహనము; 2. వాయువువలన పరోపకారము; 3. ఆకాశమువలన కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవడం; 4 నీటివలన ఎప్పుడు శుచిగా ఉండటం; 5. అగ్నివలన నిర్మలంగా ఉండటం; 6. 7. చంద్ర, సూర్యులవలన సర్వసమత్వము; 8. పావురంవలన భార్యాబిడ్డల యందు స్నేహత్యాగము; 9. కొండచిలువవలన ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించటం; 10. సముద్రంవలన ఉత్సాహ రోషములు; 11. మిడుతవలన శక్తికి తగిన పనిచేయటము; 12. తుమ్మెదవలన సారమును మాత్రమే గ్రహించటం; 13. ఏనుగువలన స్త్రీ వైముఖ్యము; 14. తేనెటీగవలన సంగ్రహణము; 15. లేడివలన విచారపరత్వమ; 16. తాబేలువలన జిహ్వాచాపల్యము; 17. ముంగిసవలన దొరికిన దానితో తృప్తిపడటం; 18. లకుమికిపిట్టవలన మోహ పరిత్యాగము; 19. బాలునివలన విచార పరిత్యాగము; 20. బాలికవలన సంగ విసర్జనము; 21. బాణాలు చేసేవాని వలన ఏకాగ్రత; 22. పామువలన ఇతరుల ఇండ్ల యందు నివసించటం; 23. సాలెపురుగువలన సంసార బంధాలలో చిక్కుపడక ఉండటము; 24. కందిరీగవలన లక్ష్యజ్ఞానము విడువక ఉండుట; నేర్చుకోవాలి.
ఈ గుణాలు గ్రహించుకుని కామం, క్రోధం, లోభం, మోహం, మదం మాత్సర్యం, అనే అరిషడ్వర్గము (ఆరుగురు శత్రువులు) జయించాలి ముసలితనం రాకుండా చావు లేకుండా ప్రాణవాయువును వశం చేసుకోవాలి. శరీరము పవిత్రంగా ఉండడం కోసం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అను వాటి మీద ఆసక్తి కలగి, పట్టణాలను గ్రామాలను నగరాలను వదలి కొండల యందు అడవులయందు తిరుగుతూ ఉండాలి. దేహం నిలవటానికి సరిపడ కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సంతోషం దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్నీ మోహాన్నీ వదలాలి. ఇంద్రియాలను జయించాలి. నన్నే తప్ప మరొకటి ఎరుగక ఆత్మనిష్ఠతో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండాలి. అట్టి యోగి నన్ను చేరగలుగుతాడు నా యందే కలుస్తాడు. మోహానికి వశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకున్నవాడు, క్రూరభావాలకు లొంగిపోయే వాడు అయిన మానవుడు ఊహాపోహలు తెలియక దీనుడై శరీరాన్ని సంకటాలు పడుతూ ఉంటాడు. దీనికొక ప్రాచీన కథ ఉంది. శ్రద్ధగా విను. మిథిలానగరంలో పింగళ అనే వేశ్యామణి ఉంది. ఆమె వలన కొంత పరిఙ్ఞానాన్ని పొందాను. ఎలాగ అంటే, ఆ వనిత డబ్బుమీది ఆశతో తన ప్రియుడిని మోసపుచ్చి ధనమిచ్చే మరొక విటుడిని మరిగింది. వాడిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. వాడితో రాత్రిళ్ళు నిద్రలేకుండా ఊర్లమ్మట, వీధులమ్మట విహరించింది. నిద్ర లేకపోవటం వలన బాగా నీరసించింది. ధనకాంక్షతో తిరిగితిరిగి అలసిపోయింది. చివరకు ఆత్మసుఖం కలిగించేవాడే భర్త అని గ్రహించుకుంది. నారాయణుడిని కనుక ఇలా చింతిస్తే కైవల్యాన్ని చెందగలను కదా, అని విచారించింది. తన శయన గృహాన్ని, సమస్త సంపదలను త్యజించింది. వాసుదేవుడి పాదపద్మాలకు నమస్కరించి తరించాలనే అభిలాష కలిగినదై, శరీరం మెరుపులా అశాశ్వతమైన దని నిశ్చయించుకుంది. పరతత్వం మీద మనస్సు లగ్నంచేసుకుని, ముక్తురాలైంది. అని శ్రీకృష్ణుడు వివరించాడు. ఉద్ధవా! దేహం శాశ్వతమైనది కాదని గ్రహించి, మోహాన్ని కత్తిరించి పారేసి, సిద్ధులు మునులు చరించే మార్గాన్ని అనుసరించి, సంసారం వదలిన మానవుడు మోక్షలక్ష్మిని పొందుతాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...